ఆసియా ఖండంలో కుంభమేళగా పిలుచుకునే.. అతిపెద్ద గిరిజిన జాతర మేడారం మహా జాతర. ఈ జాతర సమీపిస్తున్న వేళ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రెండేళ్లకు ఓసారి వచ్చే ఈ జాతరలో కోట్లాది భక్తులు సమ్మక్క – సారలమ్మలను దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తుల కోసం అన్ని రకాల వసతులను ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్ర నలుమూలల నుంచి మేడారం జాతరకు ప్రయాణికులు రానున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం ప్రతి ఏటా మేడారం మహాజాతరకు ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి హనుమకొండ బస్ స్టేషన్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రతీ బుధవారం, ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో బస్సులు నడుస్తాయని చెప్పారు. ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. మరోవైపు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలిగించడంతో ఈ ఏడాది మహాజాతరకు మహిళా భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.