శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు తరలివస్తున్నారు. గంటగంటకు రద్దీ పెరగడంతో స్వామి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు శబరిమలకు పోటెత్తారు. ఈ క్రమంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో అయ్యప్ప దర్శనానికి దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతోందని భక్తులు వాపోతున్నారు. కొంత మంది భక్తులు దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నారు.
“మేం మొన్న నిన్న ఉదయం నుంచి క్యూలో నిల్చున్నాం. ఇప్పటి వరకు అయ్యప్పస్వామి దర్శన భాగ్యం కలగలేదు. నిమిష నిమిషానికి రద్దీ పెరుగుతోంది. అధికారులు జోక్యం చేసుకుని రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టాలి. “- భక్తులు
రద్దీ నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు శబరిమలలో భక్తుల ఇక్కట్లపై కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంతి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. శబరిమలలో అయ్యప్ప స్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.