తెలంగాణ ఆర్టీసీలో వచ్చే ఐదేళ్లలో 10 వేల ఖాళీలు ఏర్పడనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచడంతో 2020, 2021లో ఎవరూ పొందలేదు. 2022 నుంచి రిటైర్మెంట్లు జరుగుతుండగా.. 2023లో ఏకంగా 2,325 ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది 2,196, వచ్చే సంవత్సరంలో 1,859, 2026లో 2,001, 2027లో 1,927 మంది ఉద్యోగ విరమణ పొందనున్నట్లు తెలిసింది.
ఇలా 2029 వరకు పది వేల మందికి పైగా పదవీ విరమణ చేయనున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎంపీల వినతుల మేరకు గ్రామాలకు అదనపు బస్సులు నడపాలని రవాణాశాఖ సూచించడంతో అదనపు ఉద్యోగులు అవసరం అవుతారు. ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం 3 వారాల క్రితమే ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉందని.. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలో పరిశీలించి ప్రతిపాదనలు పంపాలని ఆర్టీసీ అధికారులకు సూచించినట్లు సమాచారం.