తెలంగాణ మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే పలు రంగాల్లో చూపిన ప్రగతికి జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు పొందింది. తాజాగా మరో ఐదు అంతర్జాతీయ అవార్డులను తెలంగాణ గెలుచుకుంది. రాష్ట్రంలోని ఐదు ప్రతిష్ఠాత్మక నిర్మాణాలకు ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కాయి. లండన్‌కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ సంస్థ ఈ మేరకు అవార్డులు ప్రకటించింది.
తెలంగాణలోని మోజాంజాహీ మార్కెట్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదగిరిగుట్ట ఆలయానికి అవార్డులు లభించాయి. పునరుద్ధరణ విభాగంలో ఎంజే మార్కెట్‌కు, వినూత్న నమూనాతో వంతెన కేటగిరీలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. సుందర నమూనా, వర్క్ స్పేస్ బిల్డింగ్ విభాగంలో తెలంగాణ నూతన సచివాలయానికి, యూనిక్ ఆఫీస్ కేటగిరీలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అవార్డులు దక్కాయి. అద్భుతమైన అధ్యాత్మిక నిర్మాణాల విభాగంలో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి గుర్తింపు లభించింది.