అమెరికాలో మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ పట్టా పొందిన లక్కిరెడ్డి రాకేశ్‌రెడ్డి (23), రోహిత్ మణికంఠ రేపాల (25) సహా 16 మంది స్నేహితులు చదువు విజయవంతంగా పూర్తిచేసిన సందర్భంగా ఈ నెల 8న జలపాతం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో రాకేశ్, రోహిత్‌లు ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా జలపాతంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లతో వెతికించగా సుమారు 25 అడుగుల లోతులో ఇద్దరి మృతదేహాలను లభించాయి. వీరిలో రాకేశ్‌రెడ్డి.. ఖమ్మం నగరానికి చెందిన మాంటిస్సోరి, తెలంగాణ నారాయణ పాఠశాలల అధినేతల్లో ఒకరైన లక్కిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, పద్మ దంపతుల ఏకైక కుమారుడు. కుమారుల పట్టా తీసుకుంటున్న ఆనందాన్ని పంచుకోవాలనుకున్న తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్లను నిర్జీవంగా చూసి గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంఎస్ చేసిన రోహిత్ వివరాలు తెలియాల్సి ఉంది.