తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. ఎండవేడిమికి తట్టుకోలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రంలో శుక్రవారం రోజున ఆరుగురు వడదెబ్బతో మృతి చెందారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లోని 20 మండలాల్లో శుక్రవారం రోజున 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి.
అత్యధికంగా పెద్దపల్లి జిల్లా మంథని, సూర్యాపేట జిల్లా మునగాల, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పమ్మిలలో 46.7 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 2013 నుంచి అందుబాటులో ఉన్న వాతావరణ రికార్డుల ప్రకారం మే 3న నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికమని చెప్పారు. తీవ్రమైన ఎండల ధాటికి 18 జిల్లాల్లోని 95 మండలాల్లో వడగాలులు వీచాయి. ఇందులో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 17 మండలాలు, సూర్యాపేటలో 14 మండలాలు ఉన్నాయి. శని, ఆదివారాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, పలు జిల్లాలకు వడగాలుల ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.