తెలంగాణలో నేడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ జరగనుంది. ఈ పరీక్షకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు పేపర్-1… మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 78 వేల 55 మంది అభ్యర్థుల కోసం 2 వేల 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ రాధారాణి తెలిపారు. పేపర్కు-1కు.. 2 లక్షల 69 వేల 557 మంది దరఖాస్తు చేయగా… 1139 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్కు-2…. 2 లక్షల 8 వేల 498 మంది దరఖాస్తు చేయగా 913 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు.
టెట్ జరగనున్న విద్యా సంస్థలకు, ప్రభుత్వం ఇవాళ సెలవు ప్రకటించింది. పరీక్ష కోసం 2 వేల 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 22 వేల 572 మంది ఇన్విజిలేటర్లు, 10 వేల 260 మంది హాల్ సూపరింటెండెట్లను నియమించినట్లు కన్వీనర్ రాధారాణి తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని చెప్పారు. బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో ఓఎంఆర్ పత్రాల్లో సర్కిళ్లను దిద్దాలని తెలిపారు. ఈ నెల 27వ తేదీన టెట్ ఫలితాలను వెల్లడించనున్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించారు.