తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహించనున్న టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్‌టీ)లోని పోస్టులుకు ఇవాళ్టి నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబరు 20 నుంచి టీఆర్‌టీ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇందు కోసం ఇవాళ్టి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం రోజున జిల్లాల వారీగా.. సామాజికవర్గాలు, పురుషులు-మహిళల వారీగా పోస్టులు ఖరారు చేసి వాటిని పాఠశాల విద్యాశాఖ తన వెబ్సైట్లో ఉంచింది. ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య తక్కువ ఉన్న జిల్లాల్లో మహిళలకు ఎక్కువ పోస్టులు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
అయితే టీఆర్టీ పోస్టులు మహిళలకు భారీ సంఖ్యలో దక్కనున్నట్లు తెలుస్తోంది. వారికి 33% రిజర్వేషన్ ఉండటంతోపాటు తొలిసారిగా కొత్త జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లను రూపొందించడం… చాలాచోట్ల మహిళ రోస్టర్ మేరకే పోస్టులు ఉండడం తదితర కారణాలతో ఏకంగా 51 శాతానికిపైగా ఉద్యోగాలు వారికి కేటాయించారు. 2,598 మహిళలకు, 2,491 పురుషులకు దక్కనున్నాయి. జనరల్ విభాగంలోనూ పురుషులతో మహిళలు పోటీ పడతారు. ఫలితంగా 55-60% ఉద్యోగాలు వారికే దక్కనున్నాయి.