కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్మార్ట్ సిటీ నిధులపై కేసీఆర్ కుటుంబం అబద్దాలు చెబుతోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. స్మార్ట్ సిటీ మిషన్ కార్యక్రమం క్రింద తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన రు. 1000 కోట్ల నిధులలో, ఇప్పటి వరకు రు. 392 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. వరంగల్ మరియు కరీంనగర్ నగరాలకు స్మార్ట్ సిటీ మిషన్ పథకం క్రింద విడుదల చేయవలసిన 50% మ్యాచింగ్ గ్రాంట్ నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తిగా విడుదల చేయలేదు. తెలంగాణ రాష్ట్రం విడుదల చేయవలసిన రు. 392 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ నిధులలో ఇప్పటి వరకు కేవలం రు. 210 కోట్లను మాత్రమే విడుదల చేసిందని వివరించారు.
స్మార్ట్ సిటీ మిషన్ పథకం ప్రారంభమైన 2015-16 ఆర్థిక సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా మ్యాచింగ్ గ్రాంట్ నిధులను 6 సంవత్సరాలు ఆలస్యం చేసి చివరకు కేంద్రం ఒత్తిడి మేరకు 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి మాత్రమే కేటాయించడం ప్రారంభించడం జరిగిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ కోసం విడుదల చేసిన నిధుల విషయంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆలస్యం చేస్తూ వరంగల్ మరియు కరీంనగర్ స్మార్ట్ సిటీలకు బదిలీ చేయడం జరిగిందని తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయవలసిన మ్యాచింగ్ గ్రాంట్ నిధులను సమయానికి విడుదల చేసి ఉంటే, వరంగల్ మరియు కరీంనగర్ నగరాలలో సరైన డ్రైనేజి సౌకర్యం ఇప్పటికే అందుబాటులోకి వచ్చి ఉండేది, మరియు ఆయా నగరాలలో ఇటీవల సంభవించిన వరదల ప్రభావం కొంచెం తక్కువగా ఉండేదని తెలిపారు.