తెలంగాణ ఓటర్లకు అలర్ట్. రాష్ట్రంలో ఓటుహక్కు దరఖాస్తుకు గడువు నేటితో ముగియనుంది. నవంబర్ 10వ తేదీతో ఓటర్ల జాబితాలో చేర్పుల ప్రక్రియ పూర్తి కానుంది. బీఎల్‌వో, ఆన్‌లైన్ విధానంలో అర్హులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. voters.eci.gov.in, nvsp.in ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఓటర్ల తుదిజాబితా అనంతరం రాష్ట్రంలో ఇప్పటి వరకు మరో నాలుగున్నర లక్షల ఓట్లు పెరిగాయని అధికారులు తెలిపారు. అక్టోబర్ నాలుగో తేదీన ప్రకటించిన జాబితా ప్రక్రారం రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య మూడు కోట్లా 17 లక్షలకు చేరిందని.. ఈ నెల నాలుగో తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఓటుహక్కు నమోదు కోసం ఫారం-6 దరఖాస్తులు ఏడు లక్షలా 89 వేలకు పైగా వచ్చాయని తెలిపారు. వాటిలో ఇప్పటి వరకు నాలుగు లక్షలా 98 వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించారు. నాలుగు లక్షలా 54 వేల మందికి ఓటు హక్కు కల్పించారు. నవంబర్ పదో తేదీ లోపు మిగిలిన 91వేల దరఖాస్తులను పరిష్కరించి అర్హులకు ఓటుహక్కు కల్పించాల్సి ఉంది.