తెలంగాణలో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిప్పులు కక్కుతున్న సూర్యుడు ధాటికి నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రస్తుతం చాలా జిల్లాల్లో వడగాలులు వీస్తున్నాయి. ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రభావం ఉంటోంది.
ఈ క్రమంలో నేరుగా ఎండలో తిరిగేవారు, అనారోగ్యంతో ఉన్న వారు పరిస్థితి విషమించి ప్రాణాలు వదులుతున్నారు. గత నెల 25 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 17 మంది వడదెబ్బకు గురై మృత్యువాత పడినట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో ఎక్కువ మరణాలు సంభవించాయి.
వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ శరీరం చెమట రూపంలో లవణాలను కోల్పోయి డీహైడ్రేషన్ ముప్పు ఏర్పడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కడుపులో నొప్పి, కళ్లు తిరగడం, తలనొప్పి, వాంతులు, సొమ్మసిల్లి పోవడం, నీరసించడం లాంటివి వడదెబ్బ లక్షణాలు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, చిన్నారులు, వృద్ధులు అధిక వేడికి త్వరగా నీరసించిపోతారని పేర్కొంటున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.