తెలంగాణలో మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు.. ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
ఈ ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. 22 ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత క్రమంగా బలపడుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రజలంతా రెండ్రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మరోవైపు పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.