తెలంగాణ ప్రజలకు అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళా ఖాతం, దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ, రేపు తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అలెర్ట్ గా ఉండాలని తెలిపింది.
ఇది ఇలా ఉండగా.. చాలా రోజుల గ్యాప్ తర్వాత అకస్మాత్తుగా దంచికొట్టిన వానతో భాగ్యనగర వాసులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో నగరమంతా జలమయమైంది. వరద నీరు చేరి రోడ్లన్ని చెరువుల్లా మారాయి. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై వాన నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు అవస్థలు పడ్డారు. నిన్న అసెంబ్లీ, బషీర్‌బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లిబర్టీ, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, షేక్‌పేట, రాయదుర్గం ప్రాంతాల్లో భారీ జల్లులు కురిసాయి.