బీఆర్ఎస్ పాలన పై తీవ్ర విమర్శలు చేశారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. అసెంబ్లీలో భూభారతి పై చర్చ జరుగుతుండగా ఫార్ములా ఈ – కార్ రేసింగ్ ఈవెంట్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో సభను ఆర్డర్ లో పెట్టాలంటూ స్పీకర్ కి విజ్ఞప్తి చేశారు అక్బరుద్దీన్ ఓవైసీ.
అయినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్లొగన్స్ ఇవ్వడంతో ఈ పరిణామంపై అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సభలో జరిగింది పదేళ్ల బిఆర్ఎస్ పాలనను తెలియజేస్తుందని విమర్శించారు. ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజల సమస్యలను ప్రస్తావించడానికి సభకు రావాలి కానీ.. ఇలా గందరగోళం సృష్టించడానికి కాదంటూ అసహనం వ్యక్తం చేశారు.
హరీష్ రావు సహా బీఆర్ఎస్ సభ్యులంతా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఒక కుటుంబం కోసమే వారి ఆందోళన అని అన్నారు అక్బరుద్దీన్. బిఆర్ఎస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ ని కోరారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలన అంతా కచరా గవర్నెన్స్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.