రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ దశకు చేరుకుంది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి , కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని ఓటర్లందరు తమ విలువైన ఓటును వినియోగించుకోవాలని అభ్యర్థులు కోరారు.
మరోవైపు.. పోలింగ్ ప్రక్రియ క్రమంలో చండూరులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికేతరులు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే ఓ ఇంటికి వెళ్లగా.. అక్కడినుంచి స్థానికేతరులు పరారయ్యారని ఆరోపించాయి. అయితే, స్థానికేతర బీజేపీ నేతలే నియోజకవర్గంలో ఉన్నారని టీఆర్ఎస్ ఆరోపించింది. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.