ఆ జిల్లాలో కలెక్టర్ టెన్నిస్ ఆడుతారు
తహశీల్దార్ ఆయనకు తోడుగా వీఆర్ఏలను
ప్రొటొకాల్ లో భాగంగా ఉంచుతారు
ఇదేం అంటే ఇదివరకూ కూడా ఇలానే జరిగింది
అని అంటారు. ఏదయితేనేం విషయం
ప్రముఖ ప్రచురణ మాధ్యమం ద్వారా
కాస్త ప్రచారానికి నోచుకున్నాక కలెక్టర్ మరియు ఇంకా ఇతర
రెవెన్యూ వర్గాలు పాడు ప్రొటొకాల్ వద్దే వద్దని అన్నారు.
ఛీ పాడు ఇదేం పద్ధతి అని ఈసడించుకున్నారు కూడా!
పోలీసు శాఖలో ఆర్డర్లీ వ్యవస్థ ఉంది. ఆ విధానంలో పోలీసు ఉన్నతాధికారుల దగ్గర దిగువ స్థాయి సిబ్బంది పనిచేస్తారు. అదీ ఆఫీసులో కాదు ఇంట్లో.. అలానే ఇక్కడ కూడా అలాంటి సిస్టమ్ ఉంది. కానీ ఆ కలెక్టర్ ఇంతకాలం గుర్తించలేకపోయారట ! అందుకే ఓ సారి సారీ అని చెప్పండి వాళ్లకు అని తన తరఫు సందేశాన్ని పంపారు. పత్రికల్లోనూ వివిధ మీడియాల్లోనూ ముషరఫ్ అలీ (నిర్మల్ కలెక్టర్) గురించి వార్తలు వచ్చాక అప్పుడు అప్రమత్తం అయి, ఇకపై తన దగ్గర దిగువ స్థాయి రెవెన్యూ సిబ్బంది ఉండాల్సిన అవసరమే లేదని తేల్చారు.
ఇంకా చెప్పాలంటే…
నిర్మల్ కలెక్టర్ కాస్త డిఫరెంట్. అక్కడ ఉండే వీఆర్ఏలు ఇంకా డిఫరెంట్. అంటే కలెక్టర్ టెన్నిస్ ఆడుతుంటే వీఆర్ఏలు మాత్రం ఆయనకు బాల్ అందించాలి. రోజుకు ముగ్గురు వీఆర్ఏలు ఇక్కడ సాయంత్రం అయితే చాలు డ్యూటీలు చేయాలి. లాన్ సరిగా లేకుంటే అది కూడా సరిచేయాలి. వీరిపై పర్యవేక్షణకు ఒక ఆర్ఐ కూడా ఉంటారు. అప్పుడప్పుడూ తహశీల్దార్ స్థాయి వ్యక్తులు కూడా వచ్చి వెళ్తుంటారు. ఇదీ ఇప్పుడు నిర్మల్ కలెక్టర్ కు సంబంధించి వైరల్ అవుతున్న వార్త. అయితే తమ వద్ద అలాంటిదేం లేదని కలెక్టర్ చెప్పడం గమనార్హం.
ఇక్కడి అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ప్రతిరోజూ సాయంత్రం టెన్నిస్ ఆడుతుంటే ఆయనకు బాల్ అందించేందుకు ప్రతిరోజూ 3 కు చొప్పున వారానికి 21 మంది వీఆర్ఏలు ఉంటారు. ఇదే విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. అధికారులు కానీ సిబ్బంది కానీ ఉన్నది ఎవరికి అప్పగించిన సర్కారు పని వారు చేయడానికి కానీ ఇదేంటని.. ప్రింట్ తో పాటు ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రశ్నించింది. దాంతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం పై కలెక్టరు సర్ సీరియస్ అయి ఇకపై అలాంటివేమీ ఉండవని తేల్చేశారు. అంటే ఇంత కాలం తాను టెన్నిస్ ఆడుతుంటే లాన్ ను శుభ్రం చేస్తున్నవారు, బంతి అందిస్తున్న వారు, ఇంకా అక్కడే ఉండి ఆట అయ్యేదాకా ఉండి ఇంటికి వెళ్తున్నవారు ఎవరో కూడా కలెక్టర్ కు తెలియకపోవడం..వారే ఎందుకు
ఆ పనులు చేస్తున్నారో కూడా కలెక్టర్ కు తెలియకపోవడం అమితాశ్చర్యకరం.