ప్రజలే కాంగ్రెస్ పార్టీకి ఉరి వేసే రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యపేట జిల్లాలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి భాషలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. సీఎం అనే సోయి కూడా లేకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన భాష తీరే ఆయనను బొందపెడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా కేసీఆర్ ప్రస్తావన లేకుండా సభలు సాగడం లేదన్నారు.
కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఆరు గ్యారెంటీలను నమ్మి మోసపోయారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం చెందిందని తెలిపారు. కాళేశ్వరం కేసీఆర్ కు అప్పగిస్తే.. మూడు రోజుల్లో నీళ్లు ఇస్తామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం NDSP సాకుతో కాళేశ్వరం నీళ్లు రాకుండా అడ్డుకుంటోందన్నారు. రైతులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని సూచించారు జగదీశ్ రెడ్డి.