మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్ణయం కేసీఆర్​దే.. విచారణలో విశ్రాంత ఇంజినీర్లు

-

మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలన్న నిర్ణయం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​దేనని నిపుణుల కమిటీలోని కొందరు సభ్యులు న్యాయ విచారణ కమిషన్‌ ఎదుట చెప్పినట్లు సమాచారం. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహెట్టి నుంచి నీటిని మళ్లించడానికి ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ నుంచి మధ్యమానేరుకు నీటిని మళ్లించడంపై ఐదుగురు విశ్రాంత ఇంజినీర్లు అనంతరాములు, వెంకటరామారావు, దామోదర్‌రెడ్డి, చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డిలతో కూడిన కమిటీని గత సర్కార్ నియమించింది. ఈ కమిటీ తుమ్మిడిహెట్టి నుంచి నీటిని మళ్లించడానికే మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో కమిటీలోని సభ్యులను న్యాయ విచారణ కమిషన్‌ పిలిచింది. అమెరికా వెళ్లిన శ్యాంప్రసాద్‌రెడ్డి మినహా మిగిలిన అందరూ హాజరయ్యారు.

మొదటి ఎలైన్‌మెంట్‌ ప్రకారం పనులు ప్రారంభించి చాలా ఖర్చు చేశారని, మార్చడం వల్ల చేసిన వ్యయం వృథాతోపాటు విద్యుత్తు వినియోగం, పెట్టుబడి పెరుగుతుందని ఈ కారణంగానే పాత ఎలైన్‌మెంట్‌కు తాము మొగ్గు చూపామని వారు కమిషన్‌ ముందు పేర్కొన్నట్లు తెలిసింది. బ్యారేజీలు దెబ్బతినడానికి ప్రధాన కారణం ఏంటని ప్రశ్నించగా.. ఇన్వెస్టిగేషన్, డిజైన్, నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందని, దాని పర్యవసానమే ఇది అని నిపుణుల కమిటీలోని కొందరు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇన్వెస్టిగేషన్‌ చేయడానికి సమయం ఇవ్వలేదని వారు పేర్కొన్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఉందని కమిటీలోని సభ్యులు పేర్కొనగా, జస్టిస్‌ ఘోష్‌ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news