పేదవాడికి ఉన్నత విద్య అందినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రమోషన్లు పొందిన టీచర్లతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీచర్ల జోలికి వెళ్లేందుకు ఏ ప్రభుత్వం అయినా భయపడుతుందని తెలిపారు. జాతి నిర్మాణం కోసం కృషి చేస్తున్న టీచర్లకు అన్నీ తెలుసు. విద్యకు రూ.21వేల కోట్లకు పైగా కేటాయించాం. వాస్తవానికి 10 శాతం నిధులు కేటాయించాలనుకున్నాం. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల అది సాధ్యం కాలేదు.
తెలంగాణ వచ్చిన తరువాత ఉద్యోగుల పరిస్థితులు దిగజారాయి. చిత్తశుద్దితో మేము మీ పరిస్కారానికి కృషి చేస్తామన్నారు. ఉద్యమంలో టీచర్ల పాత్రను ఎవ్వరూ కాదన్నారు. పదేళ్లలో ఏనాడైనా టీచర్లకు ఫస్ట్ తారీఖు నాడు జీతాలు వేశారా..? అని ప్రశ్నించారు. ఒకేసారి టీచర్లందరికీ ప్రమోషన్లు, బదిలీలు అద్భుతమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి మంచి విద్యనందించాలని ఉపాధ్యాయులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. గత ఏడాది కంటే ఈ ఏడాది 2లక్షల వరకు అడ్మిషన్లు తగ్గాయి. వాటిని పెంచే దిశగా కృషి చేయాలని సూచించారు.