విమాన సర్వీస్ లలో ఎయిరిండియా నిర్లక్ష్యం మరోసారి ప్రశ్నార్థకమైంది. ఈ దఫా ఏకంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ఎయిరిండియా సంస్థ పేలవమైన విమాన సర్వీస్ తో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. బోపాల్ నుంచి ఢిల్లీకి ఎయిరిండియాలో ప్రయాణించిన కేంద్ర మంత్ర శివరాజ్ చౌహాన్ కి విరిగిపోయిన సీటును కేటాయించారు.
ఆ సీటులో ఆయన కూర్చొవడానికి అసౌకర్యానికి గురయ్యారు. తనకు ఎదరైన అనుభవం పై ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఎయిరిండియా విమానంలో తనకు ఎదురైన దారుణమైన పరిస్థితిని వివరించారు. టాటా గ్రూపు స్వాధీనం చేసుకున్న తరువాత సేవలు మెరుగుపడతాయని ఆశించాను. కానీ ఏ మాత్రం బాగుపడలేదని ఇప్పుడు అర్థం అయిందంటూ తన అసహనం వెళ్లగక్కారు. భోపాల్ నుంచి ఢిల్లీకి వచ్చి పూసాలో కిసాన్ మేళాను ప్రారంభించాల్సి వచ్చిందని.. కురుక్షేత్రంలో సహజ వ్యవసాయ మిషన్ సమావేశం నిర్వహించి చండీఘర్ లోని కిసాన్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో సమావేశం కావాల్సి ఉందన్నారు.