ఇవాళ జీరో షాడో డే. అంటే ఇవాళ కొన్నిప్రాంతాల్లో కొంత సేపటి వరకు నీడ కనిపించదన్న మాట. హైదరాబాద్లో ఈరోజు ఈ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. మధ్యాహ్నం 12.12 నుంచి 12.14 గంటల వరకు అంటే 2 నిమిషాల వ్యవధిలో నీడ మాయం కానుంది. సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండలో నిటారుగా(90 డిగ్రీల) ఉంచిన వస్తువుల మీద రెండు నిమిషాలు నీడ కనిపించదని బిర్లా సైన్స్ సెంటర్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రోజూ సూర్యుడు మధ్యాహ్నం తలమీదుగా వెళ్తున్నట్టు కన్పిస్తున్నా జీరో షాడో ఉండదని అధికారులు తెలిపారు. భూమి గోళాకారంగా ఉండటం వల్ల సూర్యకిరణాలు మధ్యాహ్నం భూమధ్యరేఖపై మాత్రమే పడతాయి. దానికి ఉత్తరాన, దక్షిణాన నేరుగా పడవు అని వివరించారు. ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయణంలో ఒకసారి చొప్పున ఏడాదికి రెండుసార్లు జీరోషాడో మూవ్‌మెంట్ ఉంటుందని తెలిపారు.