కాంగ్రెస్ పార్టీలో ముసలం..బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారిని తీసుకోవద్దంటూ కాంగ్రెస్ నేతలు మొత్తుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ పదవుల కోసం ఎదురుచూస్తున్న వారికి మొండి చెయ్యి చూపిస్తున్నారు. నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి మళ్లీ ఎమ్మెల్సీ పదవులు నామినేట్ చేసేలా ఒప్పందం చేసుకున్నారు. పదేళ్ల నుండి అధికారం లేక పార్టీ జెండా మోసిన వారికి కాకుండా ప్యారచ్యుట్ లీడర్లకు ప్రాధాన్యత ఇస్తుండటంతో ఒరిజినల్ కాంగ్రెస్ క్యాడర్లో గందరగోళం నెలకొంది.
ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ ప్యారచుట్ కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు నెలకొంటోంది. జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికను జీవన్ రెడ్డి రెడ్డి వ్యతిరేకించి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటే చివరికి ఢిల్లీ పెద్దలు నచ్చజెప్పారు. బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి చెరికని వ్యతిరేకిస్తూ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం ఆందోళన చేసింది. చేవెళ్ళలో కాలే యాదయ్య చేరికని వ్యతిరేకిస్తూ అభివృద్ది కార్యక్రమాలు శంకుస్థాపనకు రాకుండా అడ్డుకొని ఆందోళన చేశారు.
గద్వాలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అంటూ ప్రచారం జరుగుతుండగా సరితా తిరుపతయ్య కంటతడి పెట్టుకోగా ఆమె అనుచరులు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. తుంగతుర్తిలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి గెలిచిన మందుల సామెల్ మీద దామోదర్ రెడ్డి వర్గం ఆగ్రహంగా ఉంది. తమను కలుపుకొని పోకుండా సామెల్ ఒంటెద్దు పోకడ నచ్చక దామోదర్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు.