మహబూబ్‌నగర్ జిల్లాలో వింత ప్రవర్తన, వాంతులు, కాళ్లు చేతులు వంకర్లు పోవడం వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన దాదాపు 40 మందిలో ముగ్గురు మృతి చెందారు. అయితే వీరంతా కల్తీ కల్లు తాగడం వల్లే చనిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల జిల్లాలో అస్వస్థతకు గురైన 40 మంది కల్లు బాధితులు ప్రభుత్వాస్పత్రిలో చేరారు. వీరిలో కోడూరుకు చెందిన ఆశన్న ఆదివారం రాత్రి చనిపోగా.. మంగళవారం రాత్రి మహబూబ్‌నగర్‌లోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన విష్ణుప్రకాశ్ ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా కోడూరు గ్రామానికి రేణుక అనే మహిళ ప్రాణాలు కోల్పోవటం కలకలం రేపింది. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.
కల్తీ కల్లు తాగడం వల్లే వీరు మరణించారని వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. వారి మరణాలకు కల్తీకల్లు కారణం కాదని స్పష్టం చేశారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో వారంతా ఆస్పత్రిలో చేరారని.. వైద్య నివేదికలు, వైద్యుల పర్యవేక్షణలోనూ అదే తేలినట్లు చెప్పారు. శవపరీక్ష కోసం నమూనాలు సేకరించి, ఫోరెన్సిక్‌కు పంపామని.. రిపోర్టులో కల్తీ కల్లే కారణమని తేలితే.. బాధ్యులను విడిచిపెట్టబోమని హెచ్చరించారు.