ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తన ముద్ర వేసి, రాజకీయ దిగ్గజంగా పేరుగాంచిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమైంది. గురువారం రోజున తుమ్మలను కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇందుకు ఆయన సానుకూలంగానే స్పందించినట్లు తెలిసింది. తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తిగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు.
తుమ్మల హస్తం గూటికి చేరడంపై సెప్టెంబర్ మొదటి వారంలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 6 లేదా ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో తుమ్మల హస్తం గూటికి చేరతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కాంగ్రెస్‌లో చేరిక తర్వాత వచ్చే ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ మొదలైంది. ఆయన అనుచురులు మాత్రం మళ్లీ పాలేరు నుంచే బరిలోకి దిగుతారని బలంగా చెబుతున్నారు.