రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటును పరిశీలించేందుకు ఇవాళ భారీ ఎత్తున ప్రజాప్రతినిధులు తరలివెళ్లనున్నారు. బ్యారేజీని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు వస్తుండడంతో అధికారులు ఏర్పాట్లలో బిజీబిజీ అయ్యారు. సీఎం, మంత్రులు, ఇతర నేతలు వస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.
డీఐజీ, నలుగురు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, పెద్దసంఖ్యలో సీఐలు, ఎస్సైలు, దాదాపు 800 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ను ముఖ్యమంత్రి బృందం పరిశీలించే అవకాశం ఉండడంతో.. ఆ ప్రాంతానికి వెళ్లడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతంలో నదీ గర్భం నుంచి నీరు పైకి వస్తుండడంతో మోటార్లతో ఎత్తిపోస్తున్నారు. బ్యారేజీ ప్రాంతంలో వ్యూపాయింట్ వద్ద సభా స్థలిని ఏర్పాటు చేశారు. సుమారు 3 వేల మంది కూర్చోవడానికి వీలుగా దీన్ని సిద్ధం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను, మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని ఇక్కడి నుంచే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రజలకు సీఎం వివరించనున్నారు.