కలిసి పోటీ చేసేందుకు టీజేఎస్​తో కాంగ్రెస్ కసరత్తు.. కోదండరాంతో రేవంత్ చర్చలు

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. క్షణానికొకరు పార్టీ మారుతూ.. జంపింగ్​లలో జోరు సాగిస్తున్నారు. టికెట్ కోసం ఆశించి భంగపడ్డ నేతలంతా పార్టీ మారడంలో బిజీబిజీగా ఉన్నారు. ఇక పొత్తుల కోసం ఇటు బీజేపీ.. అటు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జనసేన-బీజేపీ పొత్తు ఖరారైంది. ఇక సీట్ల పంపకమే ఆలస్యం.

మరోవైపు వామపక్షాలతో పొత్తుకు రెడీ అయిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికీ సీట్ల లెక్క తేలక తలలు పట్టుకుంటోంది. కీలక స్థానాలను వామపక్షాలు అడుగుతుండటంతో తమకు గెలుపు సులువుగా వచ్చే స్థానాలను వదులుకునేందుకు హస్తం పార్టీ రెడీగా లేదు. ఈ క్రమంలోనే ఇప్పట్లో ఈ పొత్తు తేలేలా లేదని భావించిన కాంగ్రెస్ మరో పార్టీతో జత కట్టేందుకు పావులు కదుపుతోంది.

ఇందులో భాగంగానే ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, హస్తం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే.. టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాంను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే దిశగా నాంపల్లి టీజేఎస్ కార్యాలయంలో కోదండరామ్‌తో భేటీ అయి చర్చలు జరుపుతున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ విజయభేరీ సభకు వచ్చిన సందర్భంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీతో కోదండరామ్‌ భేటీ అయిన విషయం తెలిసిందే.  ఇరుపార్టీలు కలిసి పనిచేయాలని టీజేఎస్ అధినేతకు ఖర్గే సూచించిన అనంతరం మరోమారు చర్చించేందుకు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news