టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలకు మరిగారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువై జీహెచ్ఎంసీ మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. సామాన్యులకు ఏ పని కావాలన్నా డబ్బులు ముట్టనిదే అధికారులు పనులు చేయడం లేదని మండిపడ్డారు. పూర్తిగా లంచాలకు మరిగి ప్రజా పాలన అస్తవ్యస్తంగా తయారైందని ఫైర్ అయ్యారు. ఇక హైదరాబాద్ నగర పరిధిలో కుప్పలుతెప్పలుగా అక్రమ కోచింగ్ సెంటర్లు వెలిశాయని అన్నారు. అందులో అనుమతి పొందినవి ఎన్నో.. అనుమతులు లేనివి ఎన్నో లెక్కే లేదని ధ్వజమెత్తారు.
ఈ విషయం పై గతంలో తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని.. అయినా పట్టించుకోలేదని ఆరోపించారు రాజాసింగ్. కోచింగ్ సెంటర్ల నిర్వహకుల నుంచి GHMC అధికారులు లంచాలను తీసుకొని వారిని విచ్ఛలవిడిగా వదిలేస్తున్నారని ఆక్షేపించారు. ఇప్పటికైనా అక్రమ కోచింగ్ సెంటర్ల విషయంలో కొత్త కమిషనర్ దృష్టి పెట్టాలన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేసి ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలని డిమాండ్ చేశారు.