గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లిన టీఎస్‌పీఎస్సీ

-

గ్రూప్‌ – 1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పీల్‌కు వెళ్లింది. అత్యవసర విచారణకు లంచ్‌ మోషన్‌ అనుమతి కోరింది. దీనిపై స్పందించిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మంగళవారం రోజున విచారణ జరిపేందుకు అంగీకరించింది. గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ఈ నెల 23న హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుతో అభ్యర్థులతోపాటు కమిషన్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. మరోసారి ప్రిలిమినరీ పరీక్ష అంటే లక్షల మంది అభ్యర్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతారని కమిషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు టీఎస్‌పీఎస్సీ అప్పీలు చేసింది. మరోవైపు ఇప్పటికే రెండుసార్లు పరీక్ష రాశామని, మూడోసారి రాయడమంటే తట్టుకోలేని వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు భయపడుతున్నారు. మళ్లీ మళ్లీ చదవాలంటే మానసికంగా అలసిపోతామని వాపోతున్నారు. మళ్లీ పరీక్ష రాసినా అంతా సవ్యంగా జరుగుతుందని నమ్మకం లేదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news