BREAKING : TSPSC ఛైర్మన్ రాజీనామా

-

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌ రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి తన పదవికి ఆ మేరకు సమాచారమిచ్చారు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. గవర్నర్‌ జనార్దన్ రెడ్డి రాజీనామాను ఆమోదించారు. మరోవైపు కమిషన్‌ సభ్యులు కూడా రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో ఈ కమిషన్ జారీచేసిన గ్రూప్‌-1, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ప్రశ్నపత్రాలు లీకవడం.. ఆ తర్వాత పరీక్షలు మళ్లీ నిర్వహించడం.. అందులోనూ లోపాలు తలెత్తడం మళ్లీ పరీక్ష రద్దు కావడం.. మరోవైపు ఇతర పరీక్షల వాయిదాలు ఇలా అడుగడుగునా కమిషన్ నిర్ణయాలు నిరుద్యోగులను ఇబ్బంది పెట్టాయి. ముఖ్యంగా పేపర్ లీకేజీ ఘటన ఎంతో మంది జీవితాలను ఆగం చేసింది.

ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చాక కమిషన్‌ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఛైర్మన్‌ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా.. ఆయన రాజీనామా నిర్ణయాన్ని అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. కమిషన్‌లో జరిగిన పొరపాట్లు సరిదిద్దాలని, సంస్కరణలు చేపట్టి కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించడంతో ఆయన ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇక తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news