భద్రాచలం మెడికల్ విద్యార్థిని కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం – భద్రాచలంలోని మారుతి పారా మెడికల్ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని కారుణ్య(18) నిన్న అనుమానాస్పదంగా మృతి చెందింది. బాత్రూమ్ లో కాలు జారిపడి మృతిచెందింది అంటోంది కాలేజి యాజమాన్యం.
కానీ ఒంటి మీద గాయాలు ఉండటంతో బిల్డింగ్ పైనుండి తోసేశారంటున్నారు కుటుంబసభ్యులు. దీంతో కాలేజి ఎదుట నిరసనగా ర్యాలీ చేపట్టారు విద్యార్థి సంఘం నాయకులు,బంధువులు. కాలేజినీ సీజ్ చేయాలి, మృతురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.
ఒక్కసారిగా కాలేజి యాజమాన్యం మీద దాడికి దిగారు బంధువులు. కాలేజి యాజమాన్యం డాక్టర్ కాంతారావు, డ్రైవర్ పై దాడి కూడా చేశారు. దీంతో మారుతి పారా మెడికల్ నర్సింగ్ కాలేజీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.