తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్.రమణ (L ramana) శుక్రవారం రాజీనామా చేసిన విషయం తెల్సిందే. రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. ఇక నిన్న సీఎం కేసీఆర్ ను కలిసిన రమణ త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం.
ఎల్.రమణ టీఆర్‌ఎస్‌లోకి చేరడం దాదాపు ఖరారు కావడంతో ఆయనకు పార్టీలో ఎలాంటి స్థానం దక్కుతుందనే అంశంపై చర్చ నడుస్తుంది. అయితే ప్రధానంగా రెండు ఊహాగానాలు తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నాయి . త్వరలోనే జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎల్.రమణను బరిలోకి దింపే యోచనలో టీఆర్‌ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్ గెలిస్తే రమణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడుతారు. ఒక వేళ ఓటమి పాలైతే… త్వరలో ఖాళీ కానున్న ఆరు ఎమ్మెల్యేల కోటా, ఒక గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని రమణకు ఇచ్చి మండలికి పంపుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.