భూపాలపల్లిలో తగ్గని రాజకీయ వేడి.. ఎమ్మెల్యే గండ్రను అడ్డుకున్న పోలీసులు

-

భూపాలపల్లిలో రాజకీయ వేడి తగ్గడం లేదు. బహిరంగ చర్చపై తగ్గేదేలే అంటున్నాయి ఇరు పక్షాలు. ఇటు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్రను అడ్డుకున్నారు పోలీసులు. అటు హన్మకొండలోని స్వగృహంలో సత్యనారాయణను హౌజ్ అరెస్ట్ చేశారు. చర్చకు సిద్ధమే అంటూ ఇద్దరు నేతల ప్రకటనలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి.

తాజాగా ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి మాట్లాడుతూ.. ఆరోపణలపై చర్చకు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరానని.. 11 గంటలకు అంబేడ్కర్ సెంటర్ కు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. రాజకీయ నేతల మాటలకు ఓ హద్దు ఉండాలన్నారు గండ్ర. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే అభిమానులు స్పందిస్తారని హెచ్చరించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోవాలన్నారు. ఇక తనని బహిరంగ చర్చకు వెళ్లకుండా పోలీసులతో హౌజ్ అరెస్ట్ చేయించారని ఆరోపించారు సత్యనారాయణ.

ఎమ్మెల్యే అక్రమాలపై అన్ని ఆధారాలతో సిద్ధంగా ఉన్నానని తెలిపారు. చర్చకు రేవంత్ రెడ్డి అవసరం లేదని.. నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఇక వ్యక్తిగత దూషణలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు డిఎస్పి కిషోర్ కుమార్. నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ళతో లాండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇరువర్గాలను బయటకు రాకుండా కట్టడి చేశాం అన్నారు డిఎస్పి కిషోర్ కుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version