మేడిగడ్డ పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని విజిలెన్స్ నివేదిక: ఉత్తమ్‌

-

రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రాజెక్టులను రాష్ట్ర సర్కార్ కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు అంగీకరించిందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. అప్పగించే ప్రసక్తే లేదంటూ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అవినీతి జరిగితే విచారణ చేయించండంటూ బీఆర్ఎస్ సవాల్ విసురుతోంది.

తాజాగా ఈ వ్యవహారంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని ఆయన మరోసారి ఆరోపించారు. కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టి నీరు తరలించిందని.. ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులకు కేసీఆర్‌ అడ్డు చెప్పలేదని అన్నారు. మన నీళ్లు ఏపీకి వెళ్తుంటే కేసీఆర్ నిశ్శబ్దంగా ఉన్నారని విమర్శించారు.

ఆంధ్రకు 8 రెట్లు ఎక్కువ నీళ్లు వెళ్తే కేసీఆర్ స్పందించలేదు. గోదావరిలో 2 టీఎంసీల నీటి కోసం లక్షల కోట్లు వృథా చేశారు. కేసీఆర్‌ లక్ష కోట్ల దోచుకుని కూలుతున్న కాళేశ్వరం కట్టారు. మేడిగడ్డ పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కూడా ప్రమాదంలో ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగుబాటుపై కేసీఆర్ ఎందుకు నోరెత్తటం లేదు. కృష్ణా ప్రాజెక్టులపై మేం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news