ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 26వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి దృష్టి సారించారు. ఉపరాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటు రాకూడదని సక్రమంగా ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు.
మంగళవారం రోజున బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి బ్లూ బుక్ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ బందోబస్తు చేయాలని చెప్పారు. వైద్య సౌకర్యాలు కల్పించాలని, అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, గవర్నర్ కార్యదర్శి బి.వెంకటేశం, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, ఎస్‌పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.