ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఇటీవలే ఘనంగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అంబేడ్కర్ స్మృతివనంలోకి సందర్శకులకు అనుమతి లేదు. అంబేడ్కర్ స్మృతివనాన్ని నెల రోజుల్లో పూర్తిస్థాయిలో ప్రారంభించడానికి ప్రస్తుతం సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.
అంబేడ్కర్ విగ్రహం 125 అడుగుల ఎత్తు ఉండగా దీని పీఠం 50 అడుగుల ఎత్తులో ఉంది. పీఠం లోపలి భాగంలో 30 అడుగుల హాలును రూపొందించారు. ఇందులోని థియేటర్ను ఒకేసారి వందమంది కూర్చోడానికి వీలుగా తీర్చిదిద్దారు. ఇక్కడ రోజూ ఆయన జీవితచరిత్ర మీద చలన చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
పీఠం కింది భాగంలో హాలు నిర్మాణ పనులను మరో 20 రోజుల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆర్ అండ్ బీ అధికారి తెలిపారు. దాదాపు 11 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్మృతివనం ఉంది. వచ్చేనెల మధ్య నుంచిగానీ ఆ నెలాఖరు నుంచి ఈ కేంద్రంలోకి అధికారికంగా పర్యాటకులను అనుమతించాలని భావిస్తున్నారు. దీనికి టికెట్ పెట్టాలా, ఉచితంగానే అనుమతించాలా అన్న విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.