తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన అనంతరం శాసనసభ ఎన్నికల కసరత్తు వేగవంతమైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన సన్నాహాకాలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ ప్రతినిధి బృందం.. కొన్ని జిల్లాల్లో మాత్రం ప్రక్రియను ఇంకా వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను రెండోసారి చేపట్టింది. ఇందుకోసం గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ను ఈసీ సవరించింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 21న ముసాయిదా జాబితాను ప్రకటించనుంది. ఇందుకోసం కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల పక్రియ కొనసాగుతోంది. అక్టోబరు ఒకటో తేదీ వరకు 18 ఏళ్లు నిండే వారందరూ ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.
ముసాయిదాపై సెప్టెంబరు తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలు, వినతులకు గడువు ఇచ్చారు. వాటన్నింటిని పరిష్కరించి తుది జాబితా సిద్ధం చేసి అక్టోబరు నాలుగో తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల విధులు, నిర్వహణకు సంబంధించి అధికారులకు శిక్షణ ప్రక్రియ దశ కొనసాగుతోంది.