దేశవ్యాప్తంగా టమాట ధరలు మంటపెడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ధర కొండెక్కి కిలో టమాట రూ.150కు చేరింది. ధరలు తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నా… సామాన్యులు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. కేవలం టమాటాయే కాదు.. మిర్చి వంటి కూరగాయలకు కూడా భారీగా ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కాయగూరల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం గమనించి.. రోజూ ఎక్కువగా వినియోగించే టమాటాలను అందరికీ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే దాదాపు 50% మేర ధరలు తగ్గించింది. రేషన్ షాప్‌లలో మాత్రమే ఇది వర్తిస్తుంది. బియ్యం, పప్పు, నూనె ఎలాగైతే రేషన్ షాప్‌లలో చౌక ధరలకు లభిస్తాయో అలాగే టమాటాలనూ తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. చెన్నైలోని రేషన్ దుకాణాల్లో కిలో రూ.60కే విక్రయిస్తోంది. ముందుగా చెన్నైలోని రేషన్ షాప్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చి ఆ తరవాత రాష్ట్రవ్యాప్తంగా ఇది అమలు చేస్తామని స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. సర్కార్ నిర్ణయంతో ప్రజలకు కాస్త ఊరట లభించినట్లయింది.