వర్షపు నీటితో జూరాలకు జలకళ..!

-

ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయిని గా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కు వర్షపు నీటితో జలకళ సంతరించుకుంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్ నెలలో కురిసిన వర్షాలకు కృష్ణానదిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల నుంచి వచ్చిన నీటి చేరికతో ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. వర్షాకాలం ప్రారంభం నుంచే కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. కర్ణాటక జలాశయాలైన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి వరద నీరు రాకున్నప్పటికీ జూరాల ఎగువ ప్రాంతాలలోని కృష్ణా నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చిన వర్షపు నీటితో జూరాల పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది.

జూరాలకు వస్తున్న వర్షపు నీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన గూడెం దొడ్డి రిజర్వాయర్ కు పంపు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేశారు. అయితే గత వారం రోజుల నుంచి వరద నీటి ప్రవాహం పూర్తిగా తగ్గడంతో పంపు మోటార్లు నిలిపివేశారు. శుక్రవారం సాయంత్రం నాటికి జూరాల ప్రాజెక్టు లో 317.670 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉంది. జూరాలకు ఎగువ ప్రాంతం నుంచి 449 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు వద్ద జలకళ కన్పిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు, 9.657 ఉన్నటు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version