భూ భారతి ద్వారా సాగులో ఉన్న ప్రతీ రైతుకు న్యాయం జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. భూ భారతి పేదలు, బడుగు, బలహీన వర్గాలు, రైతులకు, భూములు ఉన్న ఆసాముల కోసం తీసుకొచ్చిందని చెప్పారు. సోమవారం నల్గొండ జిల్లా చందంపేటలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తెలంగాణ భూ భారతి చట్టం పై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ప్రతి మనిషికి ఆధార్ లాగే భూధార్ కార్డు ను ఇచ్చి ఖాతా నెంబర్ ను ఇవ్వనున్నమన్నారు.
గతంలో భూములు అమ్మిన, కొన్న మ్యాపింగ్ లేదని, ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాప్ ను తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చట్టంలో తీసుకురావడం జరిగిందని వెల్లడించారు. సాదా బైనామాలకు ధరణిలో ఎలాంటి అవకాశం లేదని, భూ భారతిలో దీనిని
పరిష్కరించనున్నామని, తొమ్మిది లక్షల 26 వేల సాదా బైనామా దరఖాస్తులున్నాయని వాటిలో
న్యాయమైన వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి పేద వాడి కన్నీళ్లు తుడిచేందుకు తీసుకువచ్చిన
చట్టం భూ భారతి చట్టం అని, ఈ చట్టాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని, చట్టాన్ని
బాగా అమలు చేసి ప్రజలకు ఉపయోగపడే చుట్టంగా చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.