రాష్ట్రంలోని విజయడైరీ సహా ఇతర డైరీ పరిధిలోని పాడి రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని తెలంగాణ డైరీ డెవలప్ మెంట్ సొసైటీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న పాల కొరతను అధిగమించేందుకు 2022 ఫిబ్రవరి నుంచి 2024 సెప్టెంబర్ వరకు పాల సేకరణ ధరను దేశంలో ఎక్కడా లేనివిధంగా మూడు దఫాలుగా రూ.12.48 పైసలు పెంచామని తెలిపారు.
అయితే కొన్ని పొరుగు రాష్ట్రాలకు చెందిన కో ఆపరేటివ్ డైరీలు, ప్రైవేట్ డైరీలు పాల సేకరణ ధరలు తగ్గించడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల వారు ఆవు పాలను తక్కువ ధరకు కొనడం.. మరోవైపు కేసీఆర్ పాలనలో తెలంగాణ విజయ డైరీ ఉత్పత్తులకు గిరాకీ తగ్గిందని తెలిపారు. అందుకే పాడి రైతుల బిల్లుల చెల్లింపులో కాస్త ఆలస్యం అయిందని.. బిల్లుల చెల్లింపునకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు అమిత్ రెడ్డి. తిరుమల లడ్డూ తయారీ కల్తీ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్నీ దేవాలయాలకు విజయ డైరీ నెయ్యినే సరఫరా చేస్తామని వెల్లడించారు గుత్తా అమిత్ రెడ్డి.