ఇదేందయ్యా ఇది.. మూలుగ బొక్క కోసం రద్దయిన పెళ్లి

-

కట్నకానుకల వద్ద మాటొచ్చో లేక వధువుకో వరుడికో పెళ్లి ఇష్టం లేకనో, లేదా పెళ్లికి ముందే వేరొకరితో ప్రేమాయణం సాగడం వల్లనో ఇలాంటి కారణాలతో పెళ్లిళ్లు ఆగిపోవడం గురించి చాలా విన్నాం. కానీ నిజామాబాద్ జిల్లాలో ఓ విచిత్రమైన కారణంతో నిశ్చితార్థం జరిగిన తర్వాత వివాహం ఆగిపోయింది. ఇంతకీ ఆ కారణమేంటో తెలుసుకుందామా?

బలగం సినిమాలో మూలుగ(పులుగు) బొక్క కోసం బావ బామ్మర్దుల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. అచ్చం అలాగే మూలుగ బొక్క కోసం జరిగిన గొడవతో పెళ్లి సంబంధం రద్దయిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన అబ్బాయికి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. నవంబరు మొదటి వారంలో నిశ్చితార్థం కూడా జరిగింది.

అయితే ఈ నిశ్చితార్థ వేడుకలో భాగంగా అమ్మాయి ఇంట్లో మాంసాహారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. అబ్బాయి బంధువులు మూలుగ బొక్క కావాలని అడగడంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలివానలా మారి పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. తర్వాత ఇరువర్గాలు శాంతించినా పెళ్లి మాత్రం క్యాన్సిల్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news