తెలంగాణలో యాసంగి వడ్ల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. దిగుబడుల అంచనాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల సంఖ్యను ఖరారు చేసిన పౌరసరఫరాల శాఖ.. రాష్ట్రవ్యాప్తంగా 8,209 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఈ సీజన్ కొనుగోళ్లు జూన్ నెలాఖరు వరకు కొనసాగించాలని నిర్ణయించింది.
అయితే ధాన్యం అమ్ముతున్న రైతులకు వెంటనే డబ్బు బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 9వ తేదీ (మంగళవారం) నాటికి 1,838 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 95,131 టన్నుల ధాన్యం (దొడ్డు రకం 9,973 టన్నులు, సన్న రకం 85,158 టన్నులు) కొనుగోలు చేశారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లకు బోనస్ రూ.500 పై సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం లెక్క ప్రకారం చెల్లించాల్సిన బోనస్ మొత్తం విలువ సుమారు రూ.4.99 కోట్లు కాగా త్వరలోనే ఈ చెల్లింపులు చేయనున్నట్లు తెలిసింది.