కర్ణాటకలో దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కన్నడ నటి పవిత్రగౌడకు అతడు అసభ్యకరమైన సందేశాలు పంపించాడనే కారణంతో రేణుకా స్వామిని హత్య చేయించినట్లు గుర్తించిన పోలీసులు ఈ కేసులో నటుడు దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్రగౌడ సహా 15 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే కొంతకాలం క్రితం ఈ కేసులో దర్శన్ బెయిల్‌పై బయటకు వచ్చాడు.
అయితే ఈ కేసుకు సంబంధించి మంగళవారం రోజున కోర్టులో విచారణ జరగగా.. దీనికి దర్శన్ గైర్హాజరయ్యాడు. నడుం నొప్పి కారణంగా విచారణకు హాజరు కాలేకపోయారని దర్శన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపగా.. కేసు విచారణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో ఉండాలని.. ఇలాంటి సాకులు చెప్పి హాజరుకాకపోతే ఎలా అంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కోర్టులో విచారణ జరిగిన కొన్ని గంటల్లోనే దర్శన్ ‘వామన’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరుకావడంతో నెటిజన్లు దర్శన్ తీరును తప్పుబడుతున్నారు.