హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేస్తానని షర్మిల ప్రకటించారు. పోలీసుల తీరుకు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు. దళితబంధులో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల తీగుల్‌లో స్థానికుల ఆందోళన చేసిన నేపథ్యంలో.. గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ మండలం తీగుల్‌లో పర్యటించేందుకు బయల్దేరిన షర్మిలను అనుమతి లేదంటూ పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
గజ్వేల్ వెళ్లి తీరుతానంటూ పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. గజ్వేల్ పర్యటనకు అనుమతి లేదని షర్మిలకు పోలీసులు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె పోలీసులపై మండిపడ్డారు. తనను వెళ్లనిచ్చేంత వరకు నిరాహార దీక్ష చేస్తానని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసులు కేసీఆర్‌కు తొత్తుల్లా పనిచేయడం మానుకోవాలని ఘాటు విమర్శలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలి తనను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చామని.. ప్రజలను కలవడానికి అనుమతి తీసుకోవాలా? అని ప్రశ్నించారు.