ఇకపై మొబైల్‌ నంబర్లకు 11 అంకెలుంటాయి..!

-

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) ‘యూనిఫైడ్‌ నంబరింగ్‌ ప్లాన్‌’ పేరిట మొబైల్‌, ల్యాండ్‌ లైన్‌ నంబర్ల సంఖ్యను మరింత పెంచుకునేందుకు పలు ప్రతిపాదనలను శుక్రవారం విడుదల చేసింది. టెలికాం రంగానికి చెందిన పలువురు నిపుణులతో జరిపిన చర్చల అనంతరం ట్రాయ్‌ ఈ ప్రతిపాదనలను కేంద్రం ముందుంచింది. మొత్తం 5 ప్రతిపాదనలను ట్రాయ్‌ సిద్ధం చేసింది. వాటిని అమలు చేస్తే ఇక దేశంలో ఇప్పటి వరకు ఉన్న 10 అంకెల మొబైల్‌ నంబర్ల స్థానంలో 11 అంకెలు కలిగిన మొబైల్‌ నంబర్లు వస్తాయి.

ట్రాయ్‌ చేసిన 5 ప్రతిపాదనల వివరాలు…

* ఇకపై ఫిక్స్‌డ్‌ ల్యాండ్‌లైన్ల నుంచి మొబైల్స్‌కు కాల్‌ చేస్తే వాటి నంబర్ల ముందు 0 (సున్నా) ను కలపాలి. అయితే ల్యాండ్‌లైన్‌ నుంచి ల్యాండ్‌లైన్‌కు, మొబైల్‌ నుంచి ల్యాండ్‌ లైన్‌కు, మొబైల్‌ నుంచి మొబైల్‌కు కాల్స్‌ చేస్తే.. 0ను ఫోన్‌ నంబర్‌ ముందు కలపాల్సిన పనిలేదు.

* ప్రస్తుతం 10 అంకెలతో ఉన్న మొబైల్‌ నంబర్లను 11 అంకెలకు పెంచాలి. మొబైల్‌ నంబర్లకు ముందు 9 అంకెను కలపడం ద్వారా అవి 11 అవుతాయి. దీంతో టెలికాం ఆపరేటర్లు 1000 కోట్ల మొబైల్‌ నంబర్లను కస్టమర్లకు ఇవ్వవచ్చు.

* ప్రస్తుతం డేటా కార్డులు, ఇతర డాంగిల్స్‌లో ఇస్తున్న సిమ్‌ కార్డులకు కూడా 10 అంకెల నంబర్లే ఉంటున్నాయి. ఇకపై వాటిని 13 అంకెలకు పెంచుతారు. దీంతో మరిన్ని డేటా కార్డులు, డాంగిల్స్‌ ఇవ్వవచ్చు.

* 3, 5, 6 అంకెలతో ప్రారంభమయ్యే ఫిక్స్‌డ్‌ ల్యాండ్‌లైన్‌ సర్వీసులకు చెందిన వాడని ఫోన్‌ నంబర్లను 2, 4 అంకెలతో ప్రారంభమయ్యే ఫిక్స్‌డ్‌ ల్యాండ్‌లైన్‌ సర్వీస్‌ ఫోన్ నంబర్లలో కలపాలి. దీంతో వాడని ఫోన్‌ నంబర్లను టెలికాం కంపెనీలు ఇతర కస్టమర్లకు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.

* ఫిక్స్‌డ్‌ ల్యాండ్‌ లైన్‌ నుంచి 0 డయలింగ్‌ సదుపాయాన్ని కల్పించాలి. దీంతో పైన చెప్పినట్లుగా ఫిక్స్‌డ్‌ ల్యాండ్‌ లైన్‌ నుంచి మొబైల్‌కు నంబర్‌కు ముందుగా 0 (సున్నా) కలిపి డయల్‌ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version