ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రాం తన యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తూనే వస్తోంది. వాట్సాప్‌కు దీటుగా ఈ యాప్ అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. అందులో భాగంగానే టెలిగ్రాంలో కొత్తగా పలు ఫీచర్లను చేర్చారు. యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్లను టెలిగ్రాం యూజర్లు ఉపయోగించుకోవచ్చు.
టెలిగ్రాం యాప్‌లో యూజర్లు తమ ప్రొఫైల్ పిక్చర్‌ను ప్రొఫైల్ వీడియో కింద మార్చుకోవచ్చు. ఎవరైనా ఇతర యూజర్లు ప్రొఫైల్‌ను చూస్తే వీడియో ప్లే అవుతుంది. అలాగే చాట్స్‌లో ఒక వీడియోలో ఉన్న ఏదైనా ఫ్రేమ్ కనిపించేలా చేయవచ్చు.
ఇప్పటి వరకు టెలిగ్రాం యాప్‌లో 1.5జీబీ వరకు సైజ్ ఉండే ఫైల్స్‌ను పంపుకునేందుకు వీలుండేది. ఇకపై 2 జీబీ సైజ్ ఉన్న ఫైల్స్‌ను అయినా పంపుకోవచ్చు. ఇక పీపుల్ నియర్‌బై అనే మరో ఫీచర్‌ను కూడా టెలిగ్రాం కొత్త అప్‌డేట్‌లో అందిస్తున్నారు. దీని సహాయంతో యూజర్లు తమ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారు తమకు ఎంత దూరంలో ఉన్నారో తెలుసుకోవచ్చు.
ఫోన్ కాంటాక్ట్‌లలో లేని వారి నుంచి మెసేజ్‌లు వస్తుంటే వారిని ఆటోమేటిగ్గా బ్లాక్ చేసేలా నూతనంగా ప్రైవసీ, సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను అందిస్తున్నారు. అలాంటి వారి మెసేజ్‌లను ఆర్కైవ్‌లోకి పంపుకోవచ్చు. లేదా చాట్స్‌ను మ్యూట్ చేయవచ్చు. ఇక 500 అంతకన్నా ఎక్కువ మెంబర్లు ఉండే గ్రూపుల అడ్మిన్లు గ్రూప్‌కు సంబంధించి డిటెయిల్డ్ గ్రాఫ్ రూపంలో యాక్టివిటీలను తెలుసుకోవచ్చు. అలాగే టాప్ మెంబర్ల వివరాలు, వారు ఎన్ని మెసేజ్‌లను పంపారు, సరాసరి ఒక్కో మెసేజ్ ఎంత నిడివి ఉంది.. వంటి వివరాలను కూడా తెలుసుకోవచ్చు. సరిగ్గా ఇవే ఫీచర్లను త్వరలో 100 మంది మెంబర్లు ఉన్న గ్రూపులకు కూడా అందివ్వనున్నారు.