ఉత్తర భారతంపై చలిపులి పంజా విసురుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పట్టపగలు కూడా బయటకు రావాలంటే ప్రజలు వణికే పరిస్థితులు ఉన్నాయి. పంజాబ్, హర్యానా, చండీగఢ్, దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తర భారతదేశం చలితో వణుకుతోంది. దిల్లీలో ఇవాళ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 7.6 డిగ్రీలుగా నమోదైంది.
పంజాబ్ భటిండాలో ఉష్ణోగ్రతలు 0.4 డిగ్రీలకు పడిపోయాయని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. హర్యానాలోని మాండ్‌కోలాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 1.3 డిగ్రీలు, ఫతేహాబాద్‌లో 3.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజస్థాన్‌లోనూ చలి కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోయాయి. మధ్యప్రదేశ్‌లోనూ ఈ నెల 4 వరకు చలి కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
చాలా ప్రాంతాల్లో పది డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గ్వాలియర్, రేవాలో ఉదయం దట్టమైన పొగమంచుకు పేరుకుపోతోంది. జమ్మూకశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లోనూ చలి కొనసాగుతోంది. శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్‌లలో పాదరసం ఐదు డిగ్రీల దిగువకు పడిపోయింది. మంగళవారం నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళ, బుధవారాల్లో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.