గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దేవాలయాలపై దాడులు తీవ్రంగా పెరిగిపోయాయని, కేవలం ఐదేళ్లలో ఆలయాలను భ్రష్టు పట్టించిందని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రసాదం కల్తీ జరిగిందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంట్లో ఓ మతం, ఇంటి బయట మరో మతం గురించి మాట్లాడే నాయకులు ఎవరైనా సరే వాళ్లని నమ్మొద్దని ప్రజలకు సూచించారు.
గతంలో రామతీర్థం విగ్రహ ధ్వంసం గురించి ప్రస్తావిస్తూ దేవుడి ప్రతిమలను ధ్వంసం చేసి విధ్వంస పాలన చేశారని ఫైర్ అయ్యారు. విగ్రహం పునర్నిర్మాణం కోసం విరాళాలు ఇస్తే వాటిని తిరిగి వెనక్కి పంపించారన్నారు. కాగా, విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహాన్ని 2020 డిసెంబర్‌లో ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.దీనిపై విచారణ జరిపిన డీజీ సునీల్ కుమార్ కూడా ఆలయం గురించి తెలిసిన వ్యక్తులే రంపంతో దేవతా మూర్తి తలను కట్ చేశారని చెప్పారు. ఆ తర్వాత రెండేళ్లకు 2022లో విగ్రహాలను మళ్లీ ప్రతిష్ఠించారు.