తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పై వైసీపీ ఎమ్మెల్యేల టెన్షన్

-

తిరుపతి సిట్టింగ్‌ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ అకాల మరణంతో త్వరలో ఇక్కడ ఉపఎన్నిక జరగనుంది. ఏకగ్రీవం మాట మర్చిపోయి అన్ని పార్టీలు పోటీకి సై అంటున్నాయి. టీడీపీ మినహా మిగతాపక్షాలు అభ్యర్ధుల వేటలో పడ్డాయి. సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకుంటామని వైసీపీ చెబుతున్నా.. మారిన రాజకీయ పరిణామాలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలలో గుబులు రేపుతున్నాయట. ఈ ఉపఎన్నిక వారి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పెద్ద పరీక్ష కాబోతున్నట్టు అప్పుడే చర్చ మొదలైంది. లోక్‌సభ పరిధిలోని YCP ఎమ్మెల్యేలకు అగ్నిపరీక్షేనా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది.

2019 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు వచ్చిన మెజారిటీ.. అదే నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీతో పార్టీ నేతలు కుస్తీ పడుతున్నారట. తిరుపతి లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లాలో ఉంటే.. సూళ్లూరుపేట, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. అందరూ వైసీపీ ఎమ్మెల్యేలే. గత ఎన్నికల్లో తిరుపతి వైసీపీ ఎంపీగా బల్లి దుర్గా ప్రసాద్‌ 2 లక్షల పైచిలుకు మెజారిటీ వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పనబాక మరోసారి టీడీపీ నుంచి బరిలో దిగుతున్నట్టు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.

2019 ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ పరిధిలో మినహా మిగతా చోట్ల వైసీపీకే మెజారిటీ వచ్చింది. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి తిరుపతిలో 708 ఓట్ల మెజారిటీ వస్తే.. ఇక్కడ టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి 3 వేల 578 ఓట్ల మెజారిటీ సాధించారు. సత్యవేడులో వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి 44 వేలకుపైగా మెజారిటీ వస్తే.. ఈ నియోజకవర్గంలో వైసీపీ ఎంపీకి 42 వేల ఆధిక్యతే వచ్చింది. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి 38వేల ఓట్ల మెజారిటీ వస్తే.. ఇక్కడ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌కు 32వేల ఓట్ల ఆధిక్యత లభించింది. సత్యవేడు, శ్రీకాళహస్తిల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీలలో వ్యత్యాసం ఉంది.

నెల్లూరు జిల్లా గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాద్‌కు 45వేల ఓట్ల మెజారిటీ వస్తే.. గతంలో ఇదే ప్రాంతంలో ఎమ్మెల్యేగా చేసిన బల్లి దుర్గా ప్రసాద్‌కు ఎంపీగా 46 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఎమ్మెల్యే కంటే కొంత పైచేయి సాధించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డికి 14వేల మెజారిటీ వస్తే.. ఎంపీకి 15వేల ఆధిక్యత వచ్చింది. సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు 78వేల ఓట్ల మెజారిటీ వస్తే… ఎంపీకి 57వేల ఆధిక్యమే లభించింది. వెంకటగిరిలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి 38 వేల ఓట్ల మెజారిటీ వస్తే.. ఎంపీకి 36 వేల ఓట్ల ఆధిక్యత లభించింది. గుడూరు, సర్వేపల్లిలో ఎమ్మెల్యేల కంటే ఎంపీకే ఎక్కువ మెజారిటీ లభిస్తే.. సూళ్లూరుపేట, వెంకటగిరిలో కొంత గ్యాప్‌ ఉంది.

వచ్చేది ఉపఎన్నిక. ప్రతి వైసీపీ ఎమ్మెల్యే తామే అభ్యర్థి అన్నట్టు పార్టీ ఎంపీ క్యాండిడేట్‌ను గెలిపించాల్సి ఉంటుంది. 2019లో ఎంపీకి వచ్చిన మెజారిటీని దాటిస్తారో.. లేక తమకొచ్చిన మెజారిటీకి చేరుకుంటారో కానీ.. మారిన రాజకీయ పరిణామాలు మాత్రం గుబులు రేపుతున్నాయట. ఎంకిపెళ్లి సుబ్చిచావుకొచ్చిందని ఆందోళన చెందుతున్నారట. గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాద్‌పై పార్టీ శ్రేణులు రగిలిపోతున్నాయి. అసమ్మతి నెలకొంది. మరి.. మిగతా చోట్ల ఎలా ఉందో అన్న చర్చ జరుగుతుంది. ఈ ఉప ఎన్నికలో వైసీపీ గెలిచినా.. గతంలో కంటే మెజారిటీ తగ్గితే ఆయా ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్‌పై ప్రతికూల ప్రభావం పడినట్టేనని చెవులు కొరుక్కుంటున్నారు. ఒకవేళ తమకంటే ఎక్కువ ఆధిక్యత తీసుకొస్తే మాత్రం.. రాష్ట్ర కేబినెట్‌ ప్రక్షాళనలో జాక్‌పాట్‌ తగులుతుందనే ప్రచారం కూడా ఉంది.

తిరుపతిలో గెలవాలనే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. ఒకవేళ గెలవలేకపోయినా.. వైసీపీ ఆధిక్యం తగ్గించినా అది మరోలా చర్చకు దారితీసే అవకాశం ఉంది. అలాగే బీజేపీ-జనసేన కలిసి సత్తా చాటుతామని చెబుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు కానీ.. BSPకి మద్దతిస్తే.. 20వేల 971 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 16 వేల 125 వచ్చాయి. మారిన రాజకీయ పరిణామాలతో ఈ రెండు పార్టీలు వైసీపీ ఓటు బ్యాంకును చీలుస్తాయా? టీడీపీ ఓటు బ్యాంకుకు గండి కొడతాయా అన్నది ఆసక్తి రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version