ఉగ్రవాదులు భారత్ ను భయపెట్టలేరని ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ కి పరోక్షంగా సవాల్ విసిరారు. శనివారం హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో ప్రధాని ఉగ్రవాదం, అభివృద్ధి ప్రభుత్వ విధానాలపై కూలంకషంగా చర్చించారు. సదస్సు ప్రాంగణంలో ప్రదర్శించిన 26/11 ముంబయి పేలుళ్ల కథనాలకు వీక్షించిన ఆయన ఈ ఘటనపై స్పందించారు. ఈ రోజు నేను 26/11 దాడికి సంబంధించిన నివేదికలు ఎగ్జిబిషన్ లో చూశాను. ఆ సమయంలో ఉగ్రవాదం భారతీయులకు పెద్ద ముప్పు. ప్రజలు సురక్షితంగా లేరని భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు ఉగ్రవాదులు తమ సొంత ప్రదేశాల్లో కూడా సురక్షితంగా లేరు.
భయ భయంగా బతుకుతున్నారు. వారు మనల్ని భయపెట్టలేరని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని.. ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా ఉందన్నారు. ప్రజల కోసం ప్రజలచే అభివృద్ధి అనేది తమ ప్రభుత్వ స్పష్టమైన లక్ష్యం అన్నారు. తాము ప్రజా ప్రయోజనాల దిశలో మాత్రమే పయాణిస్తున్నామన్నారు.